: వాషింగ్ట‌న్‌ పై తాము అణు బాంబు వేస్తే ఎలా వుంటుందో... గ్రాఫిక్స్ తో చూపించిన ఉత్తర కొరియా!


ఉత్తర కొరియా ధిక్కార ధోర‌ణి కొనసాగిస్తున్న విష‌యం తెలిసిందే. అమెరికా, ఐక్యరాజ్యసమితి విధించిన కఠిన ఆంక్షలను సైతం లెక్క చేయని ఉత్తర కొరియా.. కొన్ని రోజుల క్రితం బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించిన‌ట్లు కూడా తెలిపింది. 800 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యంగల బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించిన‌ట్లు, రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు ఉత్తర దిశలో ఈ ప్రయోగం జరిగినట్టు, మిసైల్ లక్ష్యాన్ని ఛేదించినట్టు ఆ దేశం పేర్కొన్న‌ విష‌యం తెలిసిందే. అయితే తాజాగా 'లాస్ట్ ఛాన్స్' అనే టైటిల్‌తో ఉత్తర కొరియా తన అధికారిక సైట్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ను ఉత్తర కొరియా పేల్చడం... అణు బాంబుతో ఆ నగరంపై దాడి చేయడం... జలాంతర్గామి నుంచి ఆ అణు మిసైల్‌ను వదలడం... లింకన్ మెమోరియల్ ముందు జారిపడ్డ క్షిపణి వాషింగ్ట‌న్‌ను బూడిద చేయడం... ఆ మంటల్లో అమెరికా జాతీయ జెండా కాలిపోవడం... వంటి భయంకర దృశ్యాలను ఈ వీడియోలో గ్రాఫిక్స్ తో రూపొందించారు. ఉత్తర కొరియా తాజాగా రిలీజ్ చేసిన నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు అల‌జ‌డి రేపుతోంది. 'మాతో పెట్టుకుంటే అంతా ఇలా బూడిదైపోతుంది' అంటూ ఆ దేశం చివర్లో ఓ హెచ్చరిక కూడా ఇచ్చింది. ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ మ‌ధ్య‌ ప‌దేప‌దే హెచ్చ‌రిక‌లు చేస్తుండ‌డం, ఇదే స‌మ‌యంలో ఈ వీడియోను రిలీజ్ చేయ‌డం అమెరికాను సంకట స్థితిలోకి నెడుతోంది.

  • Loading...

More Telugu News