: భువనగిరిలో ‘రుణ’పాశం!... ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
రుణం యమపాశమైంది. తలకు మించిన అప్పుల భారం ఆ వ్యక్తిని ఆత్మహత్య వైపు పురిగొలిపింది. తాను చనిపోతే... తన పిల్లలు, తల్లి పరిస్థితి ఏమిటన్న ఆ వ్యక్తి సామూహిక ఆత్మహత్య బాట పట్టాడు. వెరసి నల్లగొండ జిల్లా భువనగిరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. నిన్న రాత్రి నవ్వుతూ, తుళ్లూతూ కనిపించిన ముగ్గురు చిన్నారులు తెల్లారేసరికల్లా విగత జీవులుగా మారడంతో అక్కడ విషాదం నెలకొంది. వివరాల్లోకెళితే... సంచార జాతికి చెందిన రమేశ్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలు స్వరూప, నందిని, కావేరి, తల్లి పద్మతో కలిసి భువనగిరిలోని ఓ ఖాళీ ప్రదేశంలో గుడిసె వేసుకుని నివాసముంటున్నాడు. ఇటీవలే అతడి భార్య చనిపోయింది. ఈ క్రమంలో పెరిగిపోయిన అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడి యోచనకు అతడి తల్లి కూడా సరేనంది. ఈ క్రమంలో పురుగుల మందు కొనుగోలు చేసిన రమేశ్ దానిని కూల్ డ్రింక్ లో కలిపి ముందుగా పిల్లలకు తాగించాడు. ఆ తర్వాత తల్లితో కలిసి అతడూ తాగేశాడు. నేటి ఉదయం ఐదుగురు చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన అక్కడ తీవ్ర విషాదాన్ని నింపింది.