: హైదరాబాదులో గుండె'లయ'ను సరిచేసే సరికొత్త టెక్నాలజీ!
ప్రధానంగా వయస్సు పైబడిన వారిలో గుండె కొట్టుకోవడం (ఆట్రియల్ ఫిబ్రిలేషన్)లో హెచ్చుతగ్గులు సంభవిస్తుంటాయి. తద్వారా గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టడం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటి బారిన పడతారు. ఆట్రియల్ ఫిబ్రిలేషన్ (ఏఎఫ్) కారణంగా హార్ట్ ఫెయిల్యూర్, గుండె స్పందనలు తీవ్రంగా ఉండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటివి దరి చేరతాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారైతే గుండెపోటు బారిన పడటం, స్పృహ తప్పడం వంటి రుగ్మతల బారిన పడతారు. అనారోగ్యకరమైన జీవన విధానాలు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఒబెసిటీ, స్మోకింగ్ మొదలైన అలవాట్ల కారణంగా ఏఎఫ్ పెరగడం తద్వారా ‘గుండె’ సమస్యల బారిన పడుతుండటంతో మనదేశ ప్రజలు దీర్ఘాయుష్షును పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘాయుష్షును పొందాలంటే ఏఎఫ్ తీరు సవ్యంగా ఉండాలి. ఒకవేళ, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు సంభవించి సమస్యలు తలెత్తితే దాని నుంచి బయటపడేందుకు సురక్షితమైన కొత్త టెక్నాలజీ ‘కాంటాక్ట్ ఫోర్స్’ అందుబాటులోకి వచ్చింది. దీనిని తొలిసారిగా హైదరాబాదులో ప్రముఖ హృద్రోగనిపుణులు డాక్టర్ జయకీర్తిరావు పరిచయం చేశారు. డాక్టర్ జయకీర్తికి 'హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్టు'గా, 'ఎలక్ట్రో ఫిజియోలజిస్టు'గా జంటనగరాలలో మంచి 'కీర్తి' వుంది. నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులలో ఆయన కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ కొత్త టెక్నాలజీ గురించి ఆయన ఈ రోజు హైదరాబాదులో మీడియా సమావేశంలో వివరించారు. ఈ పద్ధతిలో ప్రత్యేకమైన క్యాధటర్స్ ఉపయోగిస్తామని, ఈ టెక్నాలజీని ఉపయోగించి మన దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాదులో ఇద్దరు పేషెంట్లకు చికిత్స నిర్వహించామని డాక్టర్ జయకీర్తి మీడియాకు చెప్పారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించిన ఈ చికిత్స విజయవంతం అవడంతో ఇద్దరు పేషెంట్లను డిశ్చార్జి చేసినట్టు ఆయన తెలిపారు. గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులను నియంత్రించడంలో భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ ‘కాంటాక్టు ఫోర్స్’ అనీ, దీనిని పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆరోగ్యశ్రీ వంటి పథకాలలో చేరిస్తే బాగుంటుందని, అందుకోసం తాను ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు.