: బడి వెనుక పిల్లల్ని పెట్టిన చిరుత!
పిల్లలు పాఠాలు నేర్చుకునే బడి వెనుక ఓ ఆడచిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన తమిళనాడులోని ఊటీ సమీపంలో జరిగింది. ఆ తర్వాత స్థానికులు అక్కడికి రావడంతో దాని నాలుగు పిల్లల్లో ఒక పిల్లని నోట కరచుకుని చిరుత అడవిలోకి తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చారు. కానీ స్థానికులు అటవీశాఖ అధికారులతో మిగతా మూడు చిరుత పిల్లల్ని ముట్టుకోవద్దని చెప్పారు. ఎందుకంటే, మిగతా పిల్లల కోసం చిరుత మళ్లీ వస్తుందని, దాని పిల్లలు కనపడకపోతే గ్రామస్థులపై అది దాడి చేసే అవకాశముందని చెప్పారు. ప్రస్తుతం చిరుత పిల్లలను ఎవరూ ముట్టుకోకుండా గ్రామస్తులు పహారా కాస్తున్నారు.