: అధికారికం... జే అండ్ కే డిప్యూటీ సీఎంగా నిర్మల్ సింగ్
జమ్మూ కాశ్మీర్ లో మరోసారి పీడీపీ-బీజేపీ కలసి అధికారాన్ని పంచుకోనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రిగా పీడీపీ ఎల్పీ నేత మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవంగా ఎన్నికై, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించనుండగా, ఉప ముఖ్యమంత్రి పదవి బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ సింగ్ ను వరించింది. ఈ విషయాన్ని బీజేపీ నేత సత్ శర్మ మీడియాకు వివరించారు. అతి త్వరలో రెండు పార్టీల ఎమ్మెల్యేలూ కలిసి గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను తెలియజేస్తారని వివరించారు. వచ్చే వారంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని తెలిపారు.