: కుక్కలా లాగేసి... మీద కూర్చున్నారు: మార్షల్స్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వంతో పాటు అసెంబ్లీ మార్షల్స్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఏపీలో పేదలను పీల్చి పిప్పిచేస్తున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ నిర్వాహకులపై చర్యలు చేపట్టమని డిమాండ్ చేసినందుకే తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారని ఆమె వాపోయారు. హైదరాబాదు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు, తాను వేసిన ప్రశ్నలు, కాల్ మనీ సెక్స్ రాకెట్ పై బాధితుల ఆవేదనలకు సంబంధించిన వీడియోలను మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె అసెంబ్లీ మార్షల్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్ పై స్పీకర్ తో మాట్లాడేందుకు వచ్చిన తాను చేతులు కట్టుకుని నిలబడిన సమయంలో తనను మార్షల్స్ కుక్కలా లాగేశారని రోజా ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యే అన్న కనీస మర్యాద లేకుండా తనను ఎత్తి వ్యాన్ లో పడేశారన్నారు. అంతటితో ఆగకుండా మీడియాకు తన ఫొటో దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో మార్షల్స్ తన మీద కూర్చున్నారని ఆమె ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు... ఆ తర్వాత తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలను చూసి తనను ఇంకో చోటికి తరలించేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే జగన్, తన పార్టీ ఎమ్మెల్యేలు నిలదీయడంతో తనను పోలీసులు ఆసుపత్రికి తరలించక తప్పలేదని ఆమె పేర్కొన్నారు.