: ఏపీఎస్ ఆర్టీసీ బస్సెక్కాలా..? ముందస్తు బుకింగ్స్ కు 20 శాతం రాయితీ


మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని, అందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాలని భావిస్తున్నారా? అయితే, త్వరపడక తప్పదు. ఎందుకంటే, ఎంత ముందుగా టికెట్లను బుక్ చేసుకుంటే, అంత ఎక్కువ రాయితీ మీకు లభిస్తుంది. చంద్రబాబు సర్కారు ఏప్రిల్ నుంచి ప్రవేశపెట్టాలని భావిస్తున్న డైనమిక్ ప్రైసింగ్ విధానంలో భాగంగా, ముందస్తు బుకింగ్స్ కు 5 నుంచి 20 శాతం వరకూ రాయితీలను ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. కనీసం నెల రోజుల ముందు బుక్ చేసుకుంటే 20 శాతం, ఆపై 15 రోజుల ముందు వరకూ 10 శాతం, వారం రోజుల ముందు వరకూ 5 శాతం రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది. ఇక, వారం ముందు నుంచి ప్రయాణ సమయం వరకూ, అందుబాటులోని సీట్ల సంఖ్య తగ్గే కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ వారం రోజుల ముందే అన్ని టికెట్లూ అమ్ముడై ఒకటో, రెండో సీట్లు పెరిగితే, మామూలు రేటుకు రెట్టింపు ధర పెట్టాల్సి రావచ్చు. ఈ మొత్తం విధానాన్ని అమలు చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటికే ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. ప్రారంభదశలో 603 సర్వీసుల్లోని 2,300కు పైగా సీట్లలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పాటించాలని, ఆపై ప్రజల స్పందనను బట్టి రిజర్వేషన్ సౌకర్యమున్న అన్ని బస్సుల్లో అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News