: వీధి బాలికే.. కానీ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్!
ఉండడానికి గూడయినా లేని వీధి బాలలు చేతిలో ఏ పాత సంచో పెట్టుకు తిరుగుతుంటారు.. వారి ముఖాలను చూస్తే ఆ బాల్యం మసకబారినట్టు కనిపిస్తుంది. దురలవాట్లకు అత్యంత దగ్గరగా మసులుతుంటారు. లైంగిక వేధింపులకు గురవుతూ చెప్పుకునే దిక్కులేక అసహాయంగా బతుకుబండి లాగిస్తుంటారు. బడి వారికి దూరమైపోతుంది. ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. అయితే చెన్నై వీధుల్లో బతుకు ఈడుస్తోన్న 14ఏళ్ల హెప్సిబా మాత్రం ప్రపంచ ఘనతను సాధించింది. బ్రెజిల్‌లోని రియో డి జనేరియోలో జరిగిన వరల్డ్ స్ట్రీట్ చైల్డ్ అథ్లెటిక్స్ గేమ్స్‌లో సత్తా చాటి ఏకంగా మూడు మెడల్స్ సాధించింది. స్ప్రింట్, రిలే, హర్డల్స్ విభాగాల్లో గెలుపొంది మూడింట్లోనూ మెడల్స్ చేజిక్కించుకుంది. స్ప్రింట్ విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. వరల్డ్ స్ట్రీట్ చైల్డ్ గేమ్స్‌లో గెలిచిన తర్వాతే బతుకంటే ఏమిటో గ్రహించానంటోంది హెప్సిబా. తోటి పిల్లలకూ కొండంత స్ఫూర్తినిస్తోంది. రియల్ రోల్ మోడల్ గా నిలుస్తోంది. హెప్సిబాను ఆదర్శంగా తీసుకొని మేమూ సాధిస్తామని చెబుతున్నారు మరి కొంత మంది బాలలు. తమకు అవకాశం ఇస్తే ఏదైనా చేసి చూపిస్తాం అని హెప్సిబా స్నేహితులు అంటున్నారు.