: మీడియాకు ధన్యవాదాలు: కన్నయ్య కుమార్
మీడియాకు ధన్యవాదాలని జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ లీడర్ కన్నయ్య కుమార్ తెలిపారు. రోహిత్ వేముల మరణంలో వాస్తవాలు వెలికి తీయడంలో మీడియా ఎంతో గొప్పగా పనిచేసిందని ఆయన ప్రశంసించారు. వారి కష్ట ఫలితమే పాలుకు పాలు, నీళ్లకు నీళ్లులా ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్నది తేలిపోయిందని ఆయన చెప్పారు. విజయవాడ ఐవీ ప్యాలెస్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, విశాలాంధ్ర పుట్టిన ఇదే భూమిపై రోహిత్ వేముల కూడా పుట్టాడని అన్నారు. రోహిత్ వేముల తల్లిని కలిసి 'అమ్మా! మనువాదాన్ని పారద్రోలేందుకు రోహిత్ జన్మించాడమ్మా...అతని పోరాటాన్ని మేం కొనసాగిస్తా'మని చెప్పానని అన్నారు. రోహిత్ బలిదానాన్ని వృధాపోనివ్వమని ఆయన చెప్పారు. రోహిత్ ఆత్మహత్య సందర్భంగా హెచ్ సీయూలో మొదలైన ప్రకంపనలు దేశాన్ని తాకాయని ఆయన చెప్పారు. విద్యార్థుల తిరుగుబాటుతో కేంద్రంలో భయం మొదలైందని ఆయన తెలిపారు. రోహిత్ వేముల, మహ్మద్ అఖ్లాక్ ఎందుకు చనిపోయారని ప్రజలు మాట్లాడుకోవడం లేదని...అధికార పక్షాల కారణంగా వారు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారనే చర్చ మొదలైందని...ఓ వ్యక్తి మృతి చెందితే వారు ఎందుకు మరణించారన్న దానిపై చర్చ జరగాలని, వారు ఏ కులానికి, మతానికి చెందిన వారనే చర్చ మంచిది కాదని ఆయన చెప్పారు. తాను పోరాటం చేసేది దీనిపైనేనని ఆయన పేర్కొన్నారు. ఈ భావజాలం దేశానికి మంచిది కాదని, దీనిని బీజేపీ, ఏబీవీపీ పెంచి పోషిస్తున్నాయని ఆయన ఆరోపించారు.