: కాశ్మీర్ పై కామెంట్ తో మరో ఇబ్బందిలో పడిన అఫ్రిది!
"మొహాలీలో జరిగిన పాకిస్థాన్, న్యూజిలాండ్ పోటీకి కాశ్మీర్ నుంచి ఎంతో మంది అభిమానులు వచ్చారు. వారంతా మా వెనుకే నిలుస్తారు" అని పాక్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ తరహా స్టేట్ మెంట్లను ఇవ్వడం సరైనది కాదని, ఈ తరహా రాజకీయాలకు ఆటగాళ్లు దూరంగా ఉండాలని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చిన కొందరు అభిమానులు టాస్ సమయంలో అఫ్రిదికి అనుకూలంగా నినాదాలు చేశారు. అప్పుడు అక్కడే ఉన్న పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా, అభిమానుల స్పందన గురించి అడుగగా, అఫ్రిది ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాగా, భారత్ తో మ్యాచ్ కి ముందు కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ, పాక్ కన్నా ఇండియాలోనే తమను ఆప్యాయంగా చూసుకుంటారని చెప్పిన అఫ్రిది తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఇక వరల్డ్ కప్ టీ-20లో ఘోర వైఫల్యంతో అఫ్రిది కెప్టెన్సీకి, జట్టులో స్థానానికి దూరం కానున్నాడని తెలుస్తోంది.