: చెప్పల్ మారో...డండా మారో...అంటూ జేఎన్ యూను గుర్తుచేసిన కన్నయ్య
జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ మరోసారి జేఎన్యూను గుర్తుచేశారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన అరెస్టు అనంతరం జేఎన్యూలో చేసిన నినాదాలనే చేశారు. స్వాతంత్ర్యం కావాలని మరోసారి నినదించారు. సభికులనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ, దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. అసహనం పెరిగిపోతోందని చెబితే అసహనంతో ఎన్నో గొంతులు అభ్యంతరకరమైన భాషలో సమాధానం చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో మనువాద సంస్కృతి, ఆధిపత్య భావజాలం నుంచి స్వాతంత్ర్యం కావాలని నినదించారు. ఈ సందర్భంగా చేసిన నినాదాల్లో తనపై చెప్పులు విసిరిన సంగతిని గుర్తుచేస్తూ...చెప్పులు విసిరినా, రాళ్లు విసిరినా, కర్రలతో దాడులు (చెప్పల్ మారో...పత్తర్ మారో..డండా మారో) చేసినా తమ డిమాండ్లు మారవని స్పష్టం చేశారు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ఒక్క గొంతు మాట్లాడినా అధికార పక్షాలు అంగీకరించడం లేదని, ఆ గొంతు నొక్కేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి గొంతును తాను వినిపిస్తున్నానని, అందుకే దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం అన్ని వర్గాలకు సమానంగా అందాలని ఆకాంక్షిస్తున్నానని కన్నయ్య కుమార్ చెప్పారు.