: వడ్డీ ఆదాయంపై తప్పుడు సమాచారమిస్తే అంతే: హెచ్చరించిన ఐటీ శాఖ
2014-15 సంవత్సరానికిగాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు వడ్డీ రూపంలో తాము పొందిన ఆదాయంపై పూర్తి వివరాలు అందించాలని అధికారులు కోరారు. 2014-15, 2015-16 సంవత్సరాలకు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న వారి సమాచారమంతా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) వద్ద వుందని, తప్పుడు సమాచారం ఇస్తే వారిపై చర్యలు తప్పవని ఐటీ అధికారులు ఓ నోటీసులో హెచ్చరించారు. "సరైన వడ్డీ వివరాలను అందించాలన్నది పన్ను చెల్లింపుదారులకు మా సలహా. మార్చి 31లోగా గడచిన ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ లను దాఖలు చేయాల్సి వుంది. వారి మొత్తం ఆదాయం పన్ను చెల్లింపు పరిధిని దాటితే తప్పనిసరిగా ఈ గణాంకాలు సమర్పించాలి" అని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయపు వివరాలు సరైన సమయంలోగా దాఖలు చేయకుంటే వారిపై జరిమానా తప్పదని హెచ్చరించారు.