: చాలా బాధగా ఉంది... ప్రాణాలతో ఆటలా?: విరుచుకుపడ్డ మంత్రి కామినేని
"23వ తారీఖున నోటీసులు ఇచ్చి 25వ తేదీ నుంచి వైద్య సేవలు ఆపివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆసుపత్రుల సమస్యలు మాకు తెలుసు. నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు వారి డబ్బులు వారికి వెళ్తాయి. ఇలా బెదిరింపు ధోరణి కూడదు" అని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను రేపటి నుంచి నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చిన వేళ, కామినేని స్పందిస్తూ, ఆసుపత్రుల నిర్ణయం తనకు బాధను కలిగించిందని, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని సలహా ఇచ్చారు. కాగా, నిధుల విడుదల కోసం రెండు నెలలకు పైగా వేచి చూసిన తరువాతనే విధిలేని పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చినట్టు ఆసుపత్రుల సంఘం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.