: ఆరు సార్లు కాంగ్రెస్ ఎంపీ... బాబు సమక్షంలో టీడీపీలోకి!
సాయిప్రతాప్... కడప జిల్లా రాజంపేట నుంచి ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన తిరుగులేని నేత. పూర్తి రెడ్ల ఆధిపత్యమున్న కడప జిల్లాలో కాపు సామాజిక వర్గానికి వెన్ను దన్నుగా నిలిచి, కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నేత. ఏపీ విభజనానంతరం కాంగ్రెస్ పార్టీని ప్రజలు దూరం పెట్టినప్పటికీ, రెండేళ్ల నుంచి అదే పార్టీలో ఉంటూ వచ్చిన నేత. ఇప్పుడు మారుతున్న పరిస్థితికి తలొగ్గాల్సి వచ్చింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడి సమక్షంలో సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన్ను ఆహ్వానించిన చంద్రబాబు స్వయంగా పచ్చ కండువాను కప్పారు. సాయిప్రతాప్ చేరికతో కడప జిల్లాలో తెలుగుదేశం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో కార్యకర్తలతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నానని సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.