: జగన్ కు మరో షాక్!... టీడీపీ గూటికి వైఎస్ సన్నిహితుడు సాయిప్రతాప్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన సొంత జిల్లా కడపలోనే మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ నేడు టీడీపీలో చేరుతున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నేత సాయిప్రతాప్ టీడీపీలో చేరితే జగన్ కేంటి నష్టమనేగా మీ డౌటు? కడప జిల్లా రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటిదాకా తొమ్మిది సార్లు పోటీ చేసిన సాయిప్రతాప్ ఆరు సార్లు విజయం సాధించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి సాయిప్రతాప్ అత్యంత సన్నిహితుడనే పేరుంది. వైఎస్ అనుచరుడుగానే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ఐదు సార్లు సుదీర్ఘకాలం పాటు ఎంపీగా కొనసాగిన సాయి ప్రతాప్... వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలోని యూపీఏ కేబినెట్ లో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజంపేట నియోజకవర్గ భౌగోళిక స్వరూపం నేపథ్యంలో ఇటు కడప జిల్లాలోనే కాక అటు చిత్తూరు జిల్లాలోనూ సాయిప్రతాప్ కు మంచి పట్టుంది. వైఎస్ మరణానంతరం సాయిప్రతాప్ వైసీపీలో చేరడం ఖాయమన్న వాదన వినిపించింది. అయితే తన తండ్రి సమకాలీనుడైన సాయిప్రతాప్ ను జగన్ అంతగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. ఈ క్రమంలో సింగిల్ సీటు కూడా గెలుచుకోలేక అధ్వాన స్థితిలో పడిపోయిన కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్ నెరపిన మంత్రాంగం ఫలించింది. టీడీపీలో చేరాలన్న సీఎం రమేశ్ ఆహ్వానానికి సాయిప్రతాప్ సానుకూలంగా స్పందించారు. నేడు హైదరాబాదులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సాయిప్రతాప్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు.