: మోదీ వద్ద మ్యాజిక్ ఉందంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత
భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఏదో తెలియని మ్యాజిక్ ఉందని, అదే ఆయన్ను పాప్యులర్ నేతగా నిలిపిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, మోదీకి ఉన్న గుర్తింపు అలాగే ఉండగా, బీజేపీ మాత్రం తన ప్రాభవాన్ని కోల్పోతోందని అన్నారు. "ఇంకా మూడేళ్ల ప్రయాణం సాగాల్సి వుంది. నిజం ఏమిటంటే, బీజేపీపై నమ్మకం పోతోంది. ఇదే సమయంలో మరో నిజం కూడా ఒప్పుకోవాలి. బీజేపీ పాప్యులారిటీ దిగజారుతున్నంతగా, మోదీ పాప్యులారిటీ తగ్గడం లేదు. ఇది మంచిదా? చెడ్డదా? అన్నది నాకు తెలియదు. ఆయనో మెజీషియన్. 2019 ఎన్నికలకు ముందు కొన్ని ట్రిక్కులను ప్రజల ముందు ప్రదర్శించవచ్చు" అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే, అది పార్టీకి విషాదకరమేనని అన్నారు.