: పబ్ లో వ్యక్తిని చితకబాదిన బౌన్సర్లు
ఒక పబ్ కు వచ్చిన వ్యక్తిని బౌన్సర్లు చితకబాదిన సంఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... మార్చి 17వ తేదీ రాత్రి ఇయాన్ పబ్ కు రాకీ(24) అనే కుర్రాడు వెళ్లాడు. అతను డ్యాన్స్ చేస్తుండగా బౌన్సర్లలో ఒకరు అతన్ని బలవంతంగా తోసివేశారు. దీంతో పబ్ లో నుంచి బయటకు వచ్చిన రాకీని వారు వెంబడించారు. అతనిపై పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. అయితే, బౌన్సర్లను ఎదుర్కొనేందుకు రాకీ ప్రతిఘటించినప్పటికీ వారి ముందు నిలువలేకపోయాడు. ఈ సంఘటనంతా సీసీటీవీ లో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి హవా సింగ్ పేర్కొన్నారు. కాగా, పబ్ నిర్వహకులు చెప్పే కథనం మాత్రం వేరేవిధంగా ఉంది. రాకీ, తన మిత్రులతో కలిసి పబ్ కు వచ్చాడని, మద్యం సేవించిన వారు పబ్ లో ఉన్న ఇతర వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.