: సంస్కారం లేని వారు సభ నడిపిస్తున్నారన్న డీకే అరుణ...కంటతడిపెట్టిన డిప్యూటీ స్పీకర్
తెలంగాణ శాసనసభలో ఈ రోజు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ, సంస్కారం లేని వారు సభ నడిపితే ఇలాగే ఉంటుందని అన్నారు. దీంతో ఆ సమయంలో చైర్ లో వున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కంటతడిపెట్టారు. దీంతో మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే అరుణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తమ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ, సభలో ఆవేశం, ఆవేదన సహజమని అన్నారు. అలాంటప్పుడు మాటలు తూలే అవకాశం ఉందని, ఇలాంటి అంశాలను పెద్దవి చేయవద్దని ఆయన సూచించారు. దీనిపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క శాసనసభలో ఆఫ్ ది రికార్డులో ఓ మహిళా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను పరిగణనలోకి తీసుకుని ఏడాది సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందేనని ఆయన చెప్పారు. తాము అలా ప్రవర్తించడం లేదని, క్షమాపణలు చెప్పాలని మాత్రమె కోరుతున్నామని ఆయన సూచించారు. ఇంతలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, సభ్యుల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.