: మరో జల జగడం!...‘రాళ్లపాడు’ నీటి కోసం ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతుల ఘర్షణ


తెలుగు నేలపై జల జగడాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలోని పాలమూరు జిల్లా, ఏపీలోని కర్నూలు జిల్లాల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) వద్ద ఏటా నీటి కోసం యుద్ధం జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ రైతులు వాదులాడుకుంటున్నారు. తాజాగా ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతుల మధ్య జల జగడం నెలకొంది. ప్రకాశం జిల్లా పరిధిలోని రాళ్లపాడు రిజర్వాయర్ వద్ద ఇరువైపులా రెండు జిల్లాల రైతులు మోహరించారు. తమ పొలాలు ఎండుతున్నాయంటూ అక్కడికి చేరుకున్న నెల్లూరు జిల్లా రైతులు రిజర్వాయర్ లోని డెడ్ స్టోరేజీ నీటిని తరలించుకువెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారు గేట్లను ఎత్తేశారు. విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా రైతులు పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. డెడ్ స్టోరేజీలోని నీటిని తరలిస్తే... పంట పొలాలు కాదు కదా, తమకు తాగు నీటికి సైతం తిప్పలు తప్పవని గేట్లను దించేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఇరు జిల్లాలకు చెందిన పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News