: ఆ ఐఏఎస్ కి 'సీఎం'గారి వికెట్ దక్కింది... టెన్షన్ మొదలైంది!
రాజకీయ నాయకుల సేవలో అధికారులు ఎంతెలా తరిస్తారో తెలిపే సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలో నాలుగు రోజుల పాటు ఐఏఎస్ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా లక్నోలోని లామార్టినీర్ మైదానంలో సీఎం ఎలెవెన్ జట్టుతో ఐఏఎస్ ఎలెవన్ జట్టు ఫ్రెండ్లీ టీట్వంటీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో సీఎం జట్టును గెలిపించేందుకు అధికారులు నానాతంటాలు పడ్డారు. ఈ మ్యాచ్ లో సీఎం అఖిలేష్ యాదవ్ 65 పరుగులతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు. అయితే, ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, సీఎంను ఔట్ చేసిన ఐఏఎస్ అధికారి మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వికెట్ తీసిన ఆనందం సంగతి దేవుడెరుగు, ఈ వికెట్ ఎందుకు తీశాన్రా బాబు? అని ఆయన చిన్నబుచ్చుకున్నారట. 128 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఐఏఎస్ అధికారులు లక్ష్య ఛేదన దగ్గరకు వచ్చేశారు. కేవలం రెండు ఓవర్లలో మూడు పరుగులు చేస్తే విజయం సాధించినట్టే...కానీ, సీఎంగారి జట్టు ఓడిపోతే బాగుండదు కదా? అందుకని జిడ్డు ఆడడం మొదలుపెట్టారు. చివర్లో 12 బంతులు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారులు కేవలం రెండు పరుగులే చేసి, చివరికి సీఎం జట్టును గెలిపించి ఆయన అభిమానం చూరగొన్నారు. దీంతో ఈ మ్యాచ్ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.