: కేరళలో ఉచిత బియ్యం పంపిణీపై విచారణకు ఆదేశం
దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న రెండు లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్న కేరళ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎలక్షన్ కమిషన్ స్పందించింది. కేరళ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా కేరళ ప్రధాన ఎన్నికల అధికారి ఈ అంశంపై విచారణను ఓ కమిటీకి అప్పజెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ దారిద్ర్యరేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు 25 కేజీల ఉచిత బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చేనెల 1నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు మే 16న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఉచిత బియ్యం పంపిణీ నిబంధనలకు విరుద్ధమని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక అందించనుంది.