: రోజాను రోజమ్మా అంటావ్... నేను అనితమ్మను కాలేనా?: అసెంబ్లీలో అనిత కన్నీరు
వైకాపా ఎమ్మెల్యే రోజాపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరుగుతున్న వేళ, తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత తన మనసులోని బాధను సభ ముందుంచారు. సామాజిక మాధ్యమాల్లో రోజా, అనిత అని సెర్చ్ చేస్తే, రోజా తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంలో తన భర్త, పిల్లలు ఎంతో బాధపడుతున్నారని, వారి బాధను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. తాను రోజాతో క్షమాపణలు మాత్రమే కోరానని తెలిపారు. రోజాను వైకాపా అధినేత జగన్ వెనకేసుకురావడం దురదృష్టకరమన్నారు. "రోజాను రోజమ్మా అని పిలిచే జగన్, తనను అనితమ్మా అని పిలవలేడా? నేను చెల్లెమ్మను కాదా? నాకు న్యాయం చేయలేడా?" అని ప్రశ్నించారు. రోజా విషయంలో సభ తీసుకునే నిర్ణయం ఏదైనా తాను కట్టుబడివుంటానని తెలిపారు. రోజా కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తపరచలేదు కాబట్టి ఆమెకు గరిష్ఠ శిక్ష విధించాలని స్పీకర్ కోడెలను కోరారు.