: భూమా పోస్టుకు బుగ్గన ఎంపిక!... సీనియర్లకు షాకిచ్చిన జగన్!


వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్లు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అమరనాథరెడ్డిలు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో షాక్ తిన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైసీపీ యువ నేత, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ను జగన్ ఎంపిక చేశారు. నేటి ఉదయం లోటస్ పాండ్ లో జరిగిన వైసీఎల్పీ భేటీలో భాగంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ సీనియర్లను విస్మయానికి గురి చేసింది. గడచిన ఎన్నికలకు కాస్తంత ముందుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ తొలియత్నంలోనే డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికే ఇవ్వడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో సభలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీ... కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమా నాగిరెడ్డిని ఆ పదవిలో నియమించింది. అయితే భూమా తన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి ఇటీవల టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో చేరే ముందు ఆయన పీఏసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సదరు పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు కోసం జ్యోతుల నెహ్రూతో పాటు చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అదే జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డిలు తమవంతు యత్నాలు చేశారు. అయితే వారందరికీ షాకిస్తూ జగన్... ఫస్ట్ టైం సభలో అడుగుపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ ను పీఏసీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News