: ఎన్డీఏ, యూపీఏకు ప్రత్యామ్యాయంగా మరో రాజకీయ శక్తి
ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా దేశంలో మరో రాజకీయ శక్తి అవతరించబోతోంది. జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్, జార్ఖండ్ వికాస్ మోర్చా-ప్రజాతాంత్రిక్, సమాజ్‌వాది జనతా పార్టీ- రాష్ట్రీయ(ఎస్జేపీఆర్) కలిసి మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీలో జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఇంట్లో ఆ పార్టీల నాయకులు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా కొత్త పార్టీ ఆవిర్భావం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల విలీన ప్రయోగం వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. కానీ ఈసారి త్వరలోనే ఈ 4 పార్టీలు విలీనం కానున్నాయని తెలుస్తోంది. తుది దశ చర్చలు జరిపిన అనంతరం కొత్త పార్టీని ప్రకటించడమే తరువాయి అన్న వాదన వినిపిస్తోంది.