: పాక్ అంటే మనవాళ్లు అలాగే రెచ్చిపోతారు... ఇప్పటివరకూ 11 సార్లు... ఆ రికార్డు అలాగే పదిలం!
ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో ఇండియాతో తలపడి దాయాది దేశం గెలిచేది లేదని మరోసారి తేటతెల్లమైంది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు నిలకడగా ఆడటంతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. దీంతో వన్డేలు, టీ-20లు కలిపి మొత్తం 11 ప్రపంచకప్ పోటీల్లో అక్షరాలా 11వ సారి సైతం విజయలక్ష్మి ఇండియావైపున నిలిచింది. తమకు ఈడెన్ గార్డెన్స్ మైదానం అచ్చివచ్చిందని ముందే సంబరపడ్డ పాకిస్థాన్ కలలు కల్లలయ్యాయి. ఢాకా, సిడ్నీ, కొలంబో, కోల్ కతా... ఏ మైదానమైనా పాక్ తో మ్యాచ్ అంటే... నేను గెలిపిస్తానని చెప్పిన కోహ్లీ, అన్న మాట నిలబెట్టుకున్నాడు. రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి, అభిమానుల్లో ఆందోళన పెరిగిన నేపథ్యంలో, బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ తనదైన శైలిలో ఆడుతూ అద్భుత రీతిన అర్ధసెంచరీ సాధించాడు. కోహ్లీకి తోడుగా సీనియర్ బ్యాట్స్ మెన్ యువరాజ్ చక్కగా రాణించడంతో, మరో 13 బంతులు మిగిలివుండగానే ఇండియా చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరోసారి దీపావళి గుర్తుకు వచ్చేలా బాణసంచా కాల్చారు. సరిహద్దుల్లో సైన్యం మిఠాయిలు పంచుకుంది.