: వ్యక్తి అపహరణపై పంజాబ్లో 22 ఏళ్ల తర్వాత కేసు నమోదు
పంజాబ్లోని గురుదాస్పూర్లో ఓ వ్యక్తి అపహరణ కేసులో 22 ఏళ్ల తర్వాత పోలీసు కేసు నమోదైంది. వ్యక్తి అపహరణలో గుర్తు తెలియని నలుగురిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. 22 ఏళ్ల క్రితం పోలీసుల ఎన్కౌంటర్లో తన భర్త చనిపోయాడని ఓ మహిళ భావించింది. అయితే, ఆ తర్వాత తన భర్త ఎన్కౌంటరయ్యాడన్న వార్తపై అనుమానం వచ్చి.. తన భర్త చనిపోలేదని ఇంకా బతికే ఉన్నాడంటూ మొదట పోలీసులను, ఆ తర్వాత 2013లో ఓ ఎన్జీవో సంస్థతో కలిసి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన పంజాబ్, హరియాణా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టాలని ఆదేశించడంతో 22 ఏళ్ల తర్వాత పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. సుఖ్పాల్సింగ్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు 1994 ఆగస్టు 13న అప్పటి ఎస్ఎస్పీ సీతారామ్రెడ్డి తీసుకురమ్మన్నారంటూ తమ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత సుఖ్పాల్ భార్య దల్బీర్ కౌర్ ఈ విషయంపై ఆరా తీయగా.. ఒకటి రెండు రోజుల్లో పంపిస్తామని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన ఇంటికి రాలేదు. ఎన్కౌంటర్లో తన భర్త చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే తన భర్త చనిపోలేదని ఆమె అప్పట్లో ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.