: ఫుట్ పాత్ పై పడుకున్న రోజా!... టిఫిన్ చేయని కారణంగా నీరసించిన వైనం
వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నడిరోడ్డుపై పడుకుండిపోయారు. హైదరాబాదులోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న రోడ్డుపై నిరసనకు దిగిన ఆమె, అక్కడే ఓ వస్త్రం పరుచుకుని పడుకుని తన నిరసన ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు యత్నించిన ఆమెను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా ఆమె అక్కడే బైఠాయించారు. ఆ తర్వాత గేటుకు కాస్తంత దూరంగా రోడ్డుపై పేవ్ మెంట్ మీద కూర్చున్న రోజా నిరసనను కొనసాగించారు. అసెంబ్లీకి హాజరుకావాలన్న భావనతో పొద్దున్నే హడావిడిగా వచ్చేసిన ఆమె టిఫిన్ (అల్పాహారం) కూడా తీసుకోలేదట. ఈ క్రమంలో గంటకు పైగా కూర్చున్న ఆమె నీరసించిపోయారు. దీంతో కూర్చునే ఓపిక లేక రోజా ఓ వస్త్రాన్ని తెప్పించుకుని అక్కడే పరుచుకుని దానిపై పడుకుండిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆమెకు సహకారమందిస్తున్నారు. నీరసించినా దీక్షను మాత్రం వీడేది లేదంటూ రోజా పడుకునే నిరసన తెలుపుతున్నారు.