: రోజాతో మార్షల్స్ వాగ్వాదం వీడియోను మీడియాకిచ్చిన జగన్... ప్రసారం చేయాలని వినతి
అసెంబ్లీ ప్రాంగణంలో మార్షల్స్ నేడు రోజాతో వాగ్వాదానికి దిగిన ఘటనను తాము సెల్ ఫోన్లలో చిత్రీకరించామని, దాన్ని మీడియాలో ప్రసారం చేయాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం రోజాను అసెంబ్లీలోకి వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్న వేళ, ఆ ఘటనను చిత్రీకరించడానికి అక్కడికి మీడియాను అనుమతించని సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలను మీడియాకు చూపించిన జగన్, "రోజమ్మను నడి రోడ్డుపై వదిలి మేము అసెంబ్లీ లోపలికి వెళ్లే అవకాశాలు లేవు. ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోము. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్న అనుమానాలు వస్తున్నాయి" అని విమర్శించారు. అసెంబ్లీని చంద్రబాబు ప్రభుత్వం అధీనంలోకి తీసుకుందని ఆరోపించారు.