: పాక్ పై చచ్చినట్టు గెలవాల్సిందే... లేకుంటే ఆశలు గల్లంతే?
వరల్డ్ కప్ టీ-20 పోటీల రెండో దశ అత్యంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో ఉన్న భారత్, తదుపరి సెమీఫైనల్స్ పోటీలకు చేరుకోవాలంటే రేపటి పాకిస్థాన్ తో మ్యాచ్ అత్యంత కీలకం. ఇప్పటికే డార్క్ హార్స్ గా పేరున్న న్యూజిలాండ్ చేతుల్లో తొలి మ్యాచ్ ఓడిపోయిన భారత జట్టు, రేపు దాయాదులతో ఈ టోర్నీ మొత్తానికి అత్యంత ఉత్కంఠ మ్యాచ్ ఆడాల్సివుంది. పాక్ తో పోరంటేనే, ఇరు దేశాలపై ఎంతో ఒత్తిడి వుంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని భారత జట్టు విజయం సాధించకుంటే, సెమీస్ అవకాశాలు దాదాపుగా నశిస్తాయని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్ 2లో పాక్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలవగా, ఇండియా, బంగ్లాదేశ్ లు చెరో ఓటమితో ఉన్నాయి. ఇండియా తదుపరి మ్యాచ్ రేపు పాక్ తో జరగనుంది. ఇప్పటికే గ్రూప్ లో 2.750 శాతం నెట్ రన్ రేటుతో పాక్ ఉండగా, ఇండియా మైనస్ 2.350 నెట్ రన్ రేటుతో ఉంది. ఈ మ్యాచ్ లో ఇండియా కనీసం 50 పరుగుల తేడాతో నెగ్గగగిలితే మైనస్ రన్ రేటు పోయి పాజిటివ్ లోకి రాగలుగుతుంది. ఆపై కూడా బలమైన ఆస్ట్రేలియా, అండర్ డాగ్స్ బంగ్లాదేశ్ తో ఆడాల్సి వుంటుంది. ఒకవేళ పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఓడిపోయిన పక్షంలో నెట్ రన్ రేట్ మరింతగా పడిపోతుంది. ఆపై ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లపై భారీ తేడాతో తప్పనిసరిగా గెలిచి ఇతర మ్యాచ్ లపై ఆధారపడాల్సి వుంటుంది. వాస్తవానికి టీ-20ల్లో భారీ పరుగుల తేడాతో పరాజయాలు అరుదు. ఈ నేపథ్యంలో ఇండియా రేపటి మ్యాచ్ ని గెలిస్తేనే, సెమీస్ రేస్ లో ఉంటుంది. లేకుంటే భారత అవకాశాలు దాదాపు లేనట్టేనని భావించాల్సి వుంటుంది. ఎందుకంటే, పాకిస్థాన్ జట్టు రెండు విజయాలతో మెరుగైన రన్ రేటుతో ఓ స్థానాన్ని, ఆపై కనీసం బంగ్లాదేశ్ ను ఓడించి న్యూజిలాండ్ రెండు విజయాలతో ఉంటాయి కాబట్టి. ఇక ఇదే గ్రూప్ లోని ఆస్ట్రేలియా ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ జట్టు సత్తా ఏంటో అందరికీ తెలుసు కాబట్టి, ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా ఇండియా జట్టు పాక్ పై గెలిచి తీరాల్సిందే. ఇక బీసీసీఐకి, ఐసీసీకి, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూ, టీవీ చానల్స్ కు కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ హైప్రొఫైల్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.