: పెళ్లయిన 17 రోజులకే హాస్టల్లో ఉరేసుకున్న మెడికో సౌమ్య... అత్తింటి వేధింపులే కారణమట!


సూదుమళ్ల సౌమ్య... కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చేస్తున్న మెడికో. గత నెల 27న ఆమెకు నల్గొండ జిల్లాకు చెందిన డాక్టర్ పవన్ కుమార్ తో వివాహమైంది. వివాహమైన 17వ రోజున ఆమెను తిరిగి హాస్టల్ వద్ద పవన్ దింపి వెళ్లగా, అదే రోజు ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కాలేజీకి వచ్చిన తరువాత ఆమె భర్తతో సెల్ ఫోన్లో చాలా సేపు మాట్లాడింది. రాత్రి స్నేహితురాలు వచ్చి భోజనానికి పిలిచినా వెళ్లలేదు. తను భోజనం ముగించుకుని తిరిగి వచ్చేసరికి ఉరేసుకుని కనిపించింది. కాగా, సౌమ్య బంధువులు మాత్రం భర్త, అత్తమామల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. పెళ్లిలో రూ. 16 లక్షల కట్నం ఇచ్చామని, ఆడపడుచుకు అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని వివాహ వేదికపైనే గొడవ చేసిన మగపెళ్లివారు అలిగి వెళ్లిపోయారని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు. గత సంవత్సరం సౌమ్య సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆ షాక్ నుంచి కోలుకోకముందే మరో ఇంటి బిడ్డ తనువు చాలించడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నిండింది.

  • Loading...

More Telugu News