: ఇంటర్ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్!... బనియన్లో బ్లూ టూత్, అండర్ వేర్ లో మొబైల్!
రెండేళ్ల క్రితమే అతని ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం ముగిసింది. అయితే రెండేళ్లుగా అతడు పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. ఎందుకని? ఏకంగా ఆరు సబ్జెక్టుల్లో ఫెయిలైన అతడు వాటిలో ఉత్తీర్ణత సాధించేందుకు పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సారి కూడా తన సొంత తెలివితేటలతో పరీక్ష గట్టెక్కడం అసాధ్యమనే అతడు నిర్ధారించుకున్నాడు. అయితే ఎలాగైనా ఈ సారి పాస్ కావాల్సిందేనన్న అతడి భావన... అతడిని ‘కాపీ’ మార్గం పట్టించింది. హైటెక్ పద్ధతిలో అతడు అనుసరించిన ఆ ‘కాపీ’ మార్గమే అతడిని కటకటాల పాలు చేసింది. అతడితో పాటు అతడి స్నేహితుడు కూడా ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకెళితే... బల్కంపేటలోని శ్రీరామ్ నగర్ కు చెందిన షేక్ ఇజాజ్ ... ఎస్ఆర్ నగర్ లోని న్యూ విజన్ జూనియర్ కాలేజీలో 2014లోనే ఇంటర్ విద్యను పూర్తి చేశాడు. అయితే కాలేజీ నుంచి బయటపడే నాటికి అతడు ఆరు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. అప్పటి నుంచి మార్చి, సెప్టెంబరు అంటూ పరీక్షలు రాస్తున్నా ఫలితం లేదు. ఈ క్రమంలో ఈ దఫా ఎలాగైనా పాస్ కావాల్సిందేనన్న అతడు... అందుకు సలహా ఇవ్వమని బోరబండ డివిజన్ నవభారత్ నగర్ కు చెందిన తన స్నేహితుడు సమీయుల్లాను ఆశ్రయించాడు. స్నేహితుడికి మంచి సలహా ఇవ్వాల్సిన సమీయుల్లా... ఇజాజ్ కు ‘కాపీ’ మార్గం బోధించాడు. స్నేహితుడి సలహా నచ్చిన ఇజాజ్... రూ.13,299 పెట్టి ఓ ఎలక్ట్రానిక్ మినీ వైర్ లెస్ సెట్ ను కొనుగోలు చేశాడు. అందులోని బ్లూ టూత్ ను బనియన్లో పెట్టుకున్న ఇజాజ్... చెవిలో ఓ మైక్రోఫోన్, అండర్ వేర్ లో సెల్ ఫోన్ పెట్టుకున్నాడు. నిన్న ‘హైటెక్ కాపీ యంత్రం’తో పరీక్షా కేంద్రానికి వచ్చిన ఇజాజ్... పరీక్ష రాస్తూ అడ్డంగా దొరికిపోయాడు. స్నేహితుడితో మాట్లాడేందుకు సంజ్ఞగా పెట్టుకున్న ‘దగ్గు’ అతడిని పట్టించేసింది. ఇజాజ్ హైటెక్ మంత్రానికి నివ్వెరపోయిన ఇన్విజిలేటర్లు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇజాజ్ తో పాటు అతడికి సలహా ఇచ్చిన సమీయుల్లాను కూడా అరెస్ట్ చేశారు.