: మరో విజయానికి వ్యూహాలు రచిస్తున్న నితీశ్, లాలూ
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జేడీ(యూ), ఆర్జేడీ కూటమి మరో ఎన్నికల సమరానికి సై అంటోంది. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ అంశంపై తర్జన భర్జనలు జరిపిన అనంతరం అసోం ప్రచార బాధ్యతల్ని నితీశ్ కుమార్ తీసుకున్నారు. ఆయనతో పాటు మరో జేడీ(యూ) ఎంపీ కేసీ త్యాగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మరోవైపు అసోంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్‌తో జేడీయూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అసోంలో జేడీ(యూ) తన అభ్యర్థుల తుది జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.