: ఒక్క వారం రోజుల్లో నలుగుర్ని పోగొట్టుకున్నాను... నేను డాక్టరిని కావడానికి ఆ సంఘటనే కారణం!: కదిలించిన స్పీకర్ కోడెల ప్రసంగం


తనపై ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడారు. ఈ ప్రసంగం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఆ ప్రసంగం వివరాలు..‘నాపై విశ్వాసం ఉంచిన సభకు ముందుగా ధన్యావాదాలు. ప్రతిపక్షం కానీ, ప్రతిపక్ష నాయకుడు గానీ ఈ విధంగా అవిశ్వాసం ప్రకటించడం కొంచెం బాధగా ఉంది. అయినప్పటికీ కూడా, నేను స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ప్రతిపక్షం కూడా సహకరించింది... ఈ విషయంలో అప్పుడు ఇప్పుడూ థ్యాంక్ ఫుల్ టూ దట్. ఈ అవిశ్వాసం ప్రతిపాదించినప్పుడు చాలామంది ప్రతిపక్ష సభ్యులు నన్ను కలిశారు. చర్చ ఎప్పుడు తీసుకుంటున్నారు? అని అడిగారు. 'నాపై పక్షపాతి అనే ముద్ర మీరు పెట్టినప్పుడు, ఎక్కువ టైం తీసుకోకుండా, నిర్ణయించాల్సిన అవసరం నాకు ఉంది. లేకపోతే ఆ చైర్ లో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది' అని ప్రతిపక్ష సభ్యులకు చెప్పాను. అప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు... నాలుగు రోజులు ఆగితే.. విత్ డ్రా చేసుకునే ఆలోచన చేస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదన చేయకముందు అది మీరు ఆలోచించుకోవాలని అప్పుడు నేను వారికి చెప్పాను. ఒకసారి ప్రతిపాదన వచ్చిన తర్వాత విత్ డ్రా చేసుకోవడం మీకు, మాకు మంచిది కాదని చెప్పాను. సో, 'ఒబే యువర్ లీడర్ ఆర్డర్స్' అని చెప్పటం జరిగింది. ఆ విధంగా మీరు వెళ్లారు. గుడ్. నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్పీకర్ గా నా డ్యూటీ నిర్వహిస్తున్నాను. నాకు తెలియక ఏవైనా పొరపాట్లు జరిగితే చెప్పలేను. కానీ, ఒక స్పీకర్ గా నా బాధ్యతలు నిర్వర్తించాను. ఈ స్పీకర్ స్థానం నాకు అనుకోని అవకాశం. ఈ సందర్భంగా నా ట్రాక్ రికార్డు గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఒడిదుడుకుల జీవితం అన్నమాట. ఒక గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం మాది. ఒక ఉన్నత కుటుంబం అయినప్పటికీ అన్నదమ్ములంతా ఆస్తి పంచుకుంటే దిగువ మధ్యతరగతి కుటుంబంలా మేము మిగిలిపోయాం. చాలా కష్టాలు చూశాను. మా అమ్మానాన్న పొలానికి వెళ్లి సొంతంగా పని చేసుకునేవారు. మా ఊరిలో నీళ్లు లేవు, రోడ్లు లేవు, చదువుకోవడానికి బడి లేదు. కరెంటు లేదు, బస్సు లేదు, వైద్యం లేదు, అలాంటి గ్రామాలను ఇంకా చూశాను. అందుకే, ఏదైనా అవకాశమొస్తే గ్రామాలను అభివృద్ధి చేయాలనేది నా తపన. ఈ బాధ ముందు తరాలు పడకూడదనేది నా తపన. ఒకసారి నాకు టైఫాయిడ్ వస్తే 30 లంఖణాలు ఉంచారు. కషాయం తాగించారు. ఇదంతా చిన్నప్పటి నుంచి చూసిన వైద్యం. డాక్టర్ ని కావాలని నాకు చిన్నప్పటి నుంచి బలంగా ఉండేది. దానికి బలమైన ముద్ర ఎట్లా పడిందంటే... నేను మా కుటుంబంలో పెద్దవాడిని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. ఆ రోజుల్లో స్మాల్ ఫాక్స్ చాలా తీవ్రంగా ఉండేది. వ్యాక్సినేషన్ వేసే వారు వస్తే పొలాల్లోకి పారిపోయేవాళ్లం. ఎందుకంటే, అది వేయించుకుంటే జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయన్న భయం. ఆ విధంగా పారిపోవడం వల్ల నా ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెళ్లని పోగొట్టుకున్నాను. ఇప్పటికీ కూడా ఆ దృశ్యం నా కళ్లముందు కనపడుతుంది. ఒక్క వారం రోజుల్లో నలుగురిని పోగొట్టుకుంటే కలిగిన బాధే నేను డాక్టర్ ను కావాలనే బలమైన ముద్ర వేసింది’ అంటూ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆర్ద్రత నిండిన మనసుతో చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News