: విమ‌ర్శ‌ల‌పై స్పందించిన అఫ్రిది.. "నాది సానుకూల సందేశ‌మే" అని వ్యాఖ్య


పాకిస్థాన్ క‌న్నా భార‌త్‌లోనే అధికంగా ప్రేమాభిమానాలు ల‌భిస్తున్నాయ‌ని పాకిస్థాన్‌ టీ20 టీం కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ గ‌త ఆదివారం వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. అయితే దీనిపై త‌న స్వ‌దేశం నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న స్పందించారు. అభిమానులపై గౌరవాన్ని చాటుతూ సానుకూల సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేశానని అఫ్రిదీ పేర్కొన్నాడు. అఫ్రిది పేర్కొన్న ఆడియో సందేశాన్ని పీసీబీ తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేసింది. తాను పాక్ ప్రజలందరి తరఫున పాక్ క్రికెట్ జ‌ట్టు నుంచి ప్రతినిధినని, త‌న వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో చూడాల‌ని ఆయ‌న ఆడియో ద్వారా కోరారు. త‌న‌కు ప్రస్తుతమున్న గుర్తింపు మొత్తం పాకిస్థాన్ నుంచి వచ్చిందేన‌ని చెప్పాడు. " కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్‌ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది" అని గ‌త ఆదివారం అఫ్రిది వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఆ దేశ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌కు పట్టరాని కోపం తెప్పించాయి. ‘‘మన దేశ క్రికెట్‌కు భారత్‌ ఏం చేసిందని పొగుడుతున్నావ్‌?’’ అంటూ అఫ్రిదిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివాదం మ‌రింత చెల‌రేగ‌కుండా అఫ్రిది ఈ విధంగా ఆడియో ద్వారా వివరణ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News