: కెనడాలో రోడ్డు ప్రమాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం
కెనడాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన రావులపల్లి లక్ష్మణ్ రావు, లక్ష్మి దంపతులు హైదరాబాద్ మణికొండలోని జైహింద్ వ్యాలీ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు వంశీకృష్ణ, చిన్నకొడుకు రాజీవ్ కృష్ణ. అమెరికాలోని వర్జీనియాలో వంశీకృష్ణ స్థిరపడ్డాడు. ఉన్నత చదువుల నిమిత్తం గత ఆగస్టులో రాజీవ్ కృష్ణ కెనడాకు వెళ్లాడు. థామ్సన్ రివర్స్ యూనివర్శిటీలో ఎంబీఏ విద్యనభ్యసిస్తున్నాడు. శనివారం రాత్రి కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో రాజీవ్ కృష్ణ (28) మృతి చెందాడు. ఈ విషయాన్ని వర్శిటీ అధికారులు అతని తల్లిదండ్రులకు సోమవారం తెలియజేశారు. లక్ష్మణ్ రావు, లక్ష్మి ఈ విషయాన్ని తమ పెద్దకుమారుడికి తెలిపారు. ఈ విషయమై కెనడా అధికారులతో అతను మాట్లాడాడని, రాజీవ్ కృష్ణ మృతి చెందిన వార్త నిజమేనని వారు ధ్రువీకరించారని తల్లిదండ్రులు చెప్పారు. అయితే, కెనడా వెళ్లేందుకు ప్రయత్నించిన వంశీకృష్ణకు అక్కడి అధికారులు వీసా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాజీవ్ కృష్ణ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు సాయపడాలని వారు విఙ్ఞప్తి చేస్తున్నారు.