: ఇండియాలో దొరకని టాలెంట్... సిలికాన్ వ్యాలీలో వెతుకుతున్న ఇన్ఫోసిస్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తదుపరి భవిష్యత్తు క్లౌడ్, సెక్యూరిటీ సేవలదేనని భావిస్తున్న దేశవాళీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, తమకు కావాల్సిన నాణ్యమైన ఉద్యోగుల కోసం సిలికాన్ వ్యాలీని ఆశ్రయిస్తోంది. ఇండియాలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న ఇన్ఫీ, ఆదాయ వృద్ధి లక్ష్యాలను అందుకోవాలంటే, కొత్త తరహా క్లౌడ్ సేవలను పరిచయం చేయాలని, అందుకు తగ్గ నిపుణుల లభ్యత ఇండియాలో సాధ్యం కావడం లేదని భావిస్తోంది. సమీప భవిష్యత్తులో మరిన్ని విలీనాలు, స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టనున్నాయని సంస్థ మౌలిక వసతుల విభాగం హెడ్ శాంసన్ డేవిడ్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ రంగం శరవేగంగా మారుతోందని అభిప్రాయపడ్డ ఆయన, ఆ వేగాన్ని అందుకోవాల్సి వుందని అన్నారు. కాగా, గత రెండు వారాలుగా సిలికాన్ వ్యాలీలో ఉన్న ఆయన క్లౌడ్ విభాగంలో సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించగల నిష్ణాతుల కోసం గాలిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా వ్యాలీలోని పలు స్టార్టప్ సంస్థలను కలిశామని, కొన్నింటిలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని డేవిడ్ వివరించారు.