: ఏపీకి హోదాపై రాజ్యసభలో తీవ్ర రభస, గందరగోళం!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం జరుగుతోంది. ఈ ఉదయం ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ నోటీసులు ఇవ్వగా, దానిపై చర్చలో వాద ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో హోదాపై పార్లమెంటు హామీ ఇవ్వగా, ఇప్పుడు బీజేపీ వెనుకంజ ఎందుకు వేస్తున్నదని ఆజాద్ ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆ సమయంలో తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ, సమస్యలన్నింటికీ కాంగ్రెస్ కారణమని, హోదాపై ఆనాడే ఎందుకు ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని ప్రశ్నించారు. "ఇదే సభలో తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపి తప్పుడు పద్ధతిలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఇప్పుడిలా మాట్లాడటం విరుద్ధంగా ఉందని అన్నారు. విభజన తరువాత కాంగ్రెస్ కు ఏపీలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ డిపాజిట్ దక్కలేదు, ప్రజలు చావుదెబ్బ తీశారు" అనగా సభలో దుమారం చెలరేగింది. ఆ సమయంలో ఆర్థికమంత్రి జైట్లీ కల్పించుకుని, పునర్విభజన చట్టంలోనే లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నో అంశాలు ఇప్పటికే పరిష్కరించామని, మరెన్నో పరిష్కరించాల్సినవి ఉన్నాయని వివరించారు. ఏపీకి ఏర్పడే ఆదాయ లోటులో ప్రతి పైసా కేంద్రం ఇస్తుందన్న హామీకి కట్టుబడి వున్నామని స్పష్టం చేశారు.