: అసెంబ్లీ నుంచి వైకాపా వాకౌట్
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాజెక్టుల పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి, మంత్రులు, కాంట్రాక్టర్లు ప్రజా ధనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అంతకుముందు ప్రాజెక్టులపై చర్చ జరుగగా, వాటి ఆలస్యానికి తప్పు మీదంటే మీదని అధికార, విపక్షాలు వాదించుకున్నాయి. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టులు అలస్యమయ్యాయని, తమ సర్కారు వాటిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు యత్నిస్తోందని తెలిపారు. వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి ప్రసంగిస్తూ, పలు నిర్మాణాల్లో అవినీతి పెరుగుతోందని, ఎప్పటికప్పుడు అంచనా వ్యయాల్ని పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధిని చేకూరుస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రశ్నోత్తరాల సమయంలో జరుగగా, ఈ విషయమై మరింత చర్చకు అనుమతించబోనని స్పీకర్ స్పష్టం చేయడంతో వైకాపా వాకౌట్ చేసింది.