: వికెట్లు లేని పిచ్ పై బంతి వేసి....!: సుప్రీం కామెంట్స్ తో జగన్ ను ఇరుకున పెట్టిన చంద్రబాబు!
ఏపీ అసెంబ్లీలో నిన్న టీడీపీ సర్కారుపై విపక్ష వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాటల తూటాలు పేలాయి. ఓ వైపు విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మరోవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా తనపై జగన్ చేసిన అవినీతి వ్యాఖ్యలు, న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తూ విపక్ష నేత చేసిన కామెంట్లపై చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో విరుచుకుపడ్దారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో జగన్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గుక్క తిప్పుకోకుండా చంద్రబాబు చేసిన ఘాటు వ్యాఖ్యలతో విపక్షం స్వరం దాదాపుగా మూగబోయిందనే చెప్పాలి. ఈ సందర్భంగా చంద్రబాబు... గతంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్లను ప్రస్తావించారు. తనపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన విచారణలు, కేసులను చంద్రబాబు ప్రస్తావించారు. ‘‘గతంలో నీ తండ్రి నాపై 26 కేసులు పెట్టారు. 23 ఎంక్వయిరీలు జరిపించారు. నీ తండ్రి ఏమీ చేయలేకపోయారు. నా మీద వేసిన కేసులను కోర్టులు తిరస్కరించాయి. 'వికెట్ లేని పిచ్ పై బంతి వేసి థర్డ్ అంపైర్ తో విచారణ చేయించి యాక్షన్ తీసుకోమన్నట్టుగా ఉంది వీరి పిటిషన్లు' అని సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వు 100 కేసులు పెట్టినా మేం సిద్ధం. చివరకు వారి కేసుల్లో కోర్టు తీవ్రంగా స్పందించి... 'కోర్టుపై బురద జల్లే ప్రయత్నం చేయవద్దు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తారా?' అని నిలదీయడంతో వారు కేసుల నుంచి వెనక్కు తగ్గారు. లక్ష్మీపార్వతి, విజయసాయిరెడ్డి, ఏబీకే ప్రసాద్ లు వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. ఆమె (విజయలక్ష్మి) కుమారుడిపై దర్యాప్తునకు ఆదేశించినందుకు చంద్రబాబుపై పిటిషన్ వేసినట్లుగా ఉందని, న్యాయమూర్తికి పక్షపాతాన్ని ఆపాదించలేరని కోర్టు చెప్పింది. మకిలి అంటిన చేతులతో కేసులు వేస్తారా? జగన్ కేసును ఈ కేసుతో ముడిపెడతారా? అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కేసు పత్రాలు బయటకు ఇస్తున్నారంటూ కోర్టుకెళ్లారు. పిటిషన్ దారుడికి కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. సీబీఐ కేసులో ఉన్న వ్యక్తిని ఎలా చూస్తాం? ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకంతోనే అతనికి సమాధానం చెబుతున్నాం’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.