: గొల్లపూడి ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి... హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన అధికారులు


నలుగురు వైద్య విద్యార్థులను బలిగొన్న కృష్ణా జిల్లా గొల్లపూడి ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ మీట్ కోసం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లిన ఉస్మానియా మెడికోలను హైదరాబాదుకు తీసుకువస్తున్న ధనుంజయ ట్రావెల్స్ బస్సు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మెడికోలతో పాటు బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న టీఎస్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నేటి ఉదయమే గొల్లపూడి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాగా, ఈ ఘోర ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే, క్షతగాత్రులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. 9440752310 నెంబరుకు ఫోన్ చేసి గాయపడ్డ వారి పరిస్థితిని తెలుసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News