: ‘మహా’ మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్... విచారణకు పిలిచి అరెస్ట్ చేసిన ఈడీ
మహారాష్ట్ర రాజకీయాల్లో నిన్న భారీ కుదుపు చోటుచేసుకుంది. మహారాష్ట్ర సదన్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ కీలక నేత ఛగన్ భుజ్ బల్ అరెస్టయ్యారు. రాష్ట్రంలోనే కాక దేశంలోనూ పెను కలకలం రేపిన సదన్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే భుజ్ బల్ కుమారుడు సహా పలువురిని విచారించింది. నిన్న విచారణకు హాజరైన ఛగన్ భుజ్ బల్ ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించని కారణంగానే భుజ్ బల్ ను అరెస్ట్ చేసినట్లు ఆ తర్వాత ఈడీ ప్రకటించింది. నేడు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.