: నా గొంతు మీద కత్తి పెట్టి చెప్పమన్నా.. భారత్ మాతా కి జై అని చెప్పను: ఓవైసీ
తన గొంతు మీద కత్తి పెట్టి చెప్పమన్నా.. భారత్ మాతా కి జై అనే నినాదాన్ని చెప్పబోనని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముంబయిలోని లాతూర్ జిల్లా ఉదయ్‌గిరిలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశభక్తిపై ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించిన ఆయన... భారత్ మాతా కి జై అనే నినాదాన్ని తాను చెప్పబోనని అన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్‌పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. అలా నినాదాలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదన్నారు. పార్లమెంటు మీద దాడి కేసులో ఉరిశిక్ష విధించిన అఫ్జల్‌గురు వర్ధంతిని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిర్వహించిన సందర్భంగా జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మోహన్ భగవత్ ఇటీవల స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ మాతా కి జై అనే నినాదాన్ని రాబోయే తరాలకు నేర్పించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాజాగా మోహన్ భగవత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఓవైసీ స్పందించారు.