: జమ్మూ కాశ్మీర్లో జాతి వ్యతిరేక నినాదాలు సాధారణమే!: ఫరూఖ్ అబ్దుల్లా
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశ వ్యతిరేక నినాదాలు, స్టూడెంట్ లీడర్ కన్నయ్య అరెస్టు, విడుదల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. అటువంటి దేశవ్యతిరేక నినాదాలు ఇండియాను విడదీయలేవని ఉద్ఘాటించారు. జమ్ముకాశ్మీర్ లోనూ జాతి వ్యతిరేక నినాదాలు సాధారణమని, అవి దేశాన్ని విడదీయలేవని మీరట్‌లో మీడియాతో అన్నారు. బీజేపీ తన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. యువత అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగ కల్పన చేయలేదన్నారు. బ్లాక్ మనీని వెనక్కి తెప్పించడంలోనూ బీజేపీ విఫలమైందన్నారు. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కూటమి ఇంతవరకూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మోదీ లాహోర్ లో ఆకస్మికంగా పర్యటించి పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ దాన్ని స్వాగతిస్తున్నానన్నారు. మోదీ పర్యటనతో పాక్-ఇండియా మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.