: ఈడీ విచారణకు మరో కీలక రాజకీయవేత్త... ఈడీ ఆఫీస్ ముందు అనుచరుల వీరంగం
రాజకీయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో కాకలు తీరిన రాజకీయవేత్తలు కూడా ఆయా దర్యాప్తు సంస్థల ముందు విచారణకు బారులు తీరుతున్నారు. తెలుగు నేలలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ జాబితాలో తాజాగా మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ కీలక నేత ఛగన్ భుజ్ బల్ చేరిపోయారు. మహారాష్ట్రలో పెను కలకలం రేపిన మహారాష్ట్ర సదన్ కేసు విచారణ కోసం భుజ్ బల్ నేటి ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల వైఖరిని నిరసిస్తూ భుజ్ బల్ మద్దతుదారులు ఈడీ కార్యాలయం ముందు వీరంగమాడారు. పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న భుజ్ బల్ మద్దతుదారులు... తమ నేతకు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కొద్దిసేపు ఓపిక పట్టిన ఈడీ అధికారులు ఆ తర్వాత ఢిల్లీ పోలీసులను రంగంలోకి దించారు. దీంతో భుజ్ బల్ మద్దతుదారులు తోకముడిచారు. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది.