: ఆరెస్సెస్ ‘ప్యాంట్’లపై జేడీయూ సెటైర్లు!
బీజేపీ సైద్ధాంతిక గురువుగా ముద్రపడ్డ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)... సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న తన డ్రెస్ కోడ్ ను మార్చేసింది. ఇప్పటిదాకా ఆరెస్సెస్ కార్యకర్తలు ధరిస్తూ వచ్చిన ఖాకీ నిక్కర్ల స్థానంలో ఫుల్ ప్యాంట్లు వచ్చేశాయి. నెలల తరబడి దీనిపై దఫదఫాలుగా చర్చలు జరిపిన ఆరెస్సెస్ అగ్ర నేతలు ఎట్టకేలకు డ్రెస్ కోడ్ మార్పునకే మొగ్గుచూపారు. ఈ మార్పుపై బీహార్ లో అధికార కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా లాలూ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ జనతాదళ్ (యునైటెడ్) కూడా సెటైర్లు విసిరింది. నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు వేసుకున్నంతమాత్రాన స్వయం సేవకులు ఆధునికులుగా మారిపోలేరని ఆర్జేడీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు జేడీయూ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ కొద్దిసేపటి క్రితం పాట్నాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫుల్ ప్యాంట్లు వేసుకుంటేనే మీరు ఆధునికులుగా మారలేరని లాలూ చాలా ఆలోచించిన మీదటే అన్నారు. మీ మెంటాలిటీ మార్చుకోవాల్సి ఉంది. మీ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సి ఉంది. కేవలం హిందూవాదాన్ని పట్టుకుని మాట్లాడగానే మీరు ఆధునికులుగా మారలేరు’’ అని ఆయన ఆరెస్సెస్ పై విమర్శలు గుప్పించారు.