: బాల కార్మిక నిర్మూలన చట్టాలను బలోపేతం చేయాలి: మోదీకి కైలాష్ సత్యార్థి లేఖ
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి(62) బాలకార్మిక చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బాల కార్మిక చట్టం బలంగా లేకపోతే మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా ప్రోగ్రాం పూర్తి వైఫల్యం చెందుతుందని సత్యార్థి లేఖలో పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టుబడిదారులు భారత్‌కు వచ్చి తయారీ రంగానికి ఊతమిచ్చినప్పటికీ, ప్రపంచంతో పోల్చినపుడు భారత్‌లో బాలకార్మిక చట్టం బలహీనంగా ఉంటే మేకిన్ ఇండియా పూర్తి విషమపరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. మేకిన్ ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని, దాని అభివృద్ధి దృష్ట్యా దేశంలో బలహీనంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలని లేఖలో సూచించారు. తయారీ రంగంలో పిల్లలను అక్రమంగా ఉపయోగిస్తే మేకిన్ ఇండియా ఒక మచ్చ లాంటిది అవుతుందని కైలాష్ సత్యార్థి అన్నారు. ఈ సందర్భంగా యాపిల్ వంటి యూఎస్ కంపెనీలు చైనా బాల కార్మికులని ఉపయోగించుకుంటున్నాయని వచ్చిన ఆందోళనను గుర్తుచేశారు. కాబట్టి బాల కార్మిక చట్టం బలోపేతం చేయాలని కోరారు.