: ఆరు నూరైనా అనుకున్నదే చేస్తా... ఎవరి మాటా వినను: కేసీఆర్
తాను అనుకున్నది చేసి తీరే రకాన్నని, ప్రజలకు మేలు జరుగుతుందని భావించే పనుల విషయంలో వెనుకంజ వేయబోనని, ఎవరి మాటా వినేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న ఆయన విపక్షాలు చేస్తున్న పలు విమర్శలకు సుధీర్ఘ వివరణతో కూడిన సమాధానాలు ఇస్తూ, అప్పుడప్పుడూ విమర్శనాస్త్రాలు సంధించారు. మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్, మెట్రో ప్రాజెక్టు, మహారాష్ట్రతో చేసుకున్న జల ఒప్పందాలు, రహదారుల అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి ఎన్నో అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రతిదానిని విమర్శించడం విపక్షాలకు పనిగా మారిపోయిందని ఎద్దేవా చేసిన ఆయన, మంచి పనికి సహకరించాలన్న ఇంగిత జ్ఞానం వారికి లేకపోయిందని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే దిశలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందడుగేనని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల వివాదాలకు ఏపీ అధికారులే కారణమని విమర్శించారు. ప్రజలకు అధునాతన వైద్య సేవలను అందించే దిశగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు, విదేశాల్లోని ఆసుపత్రులను పరిశీలించి వచ్చామని, త్వరలో గంజినీరు తాగే పేదకు కూడా కార్పొరేట్ వైద్యం అందుతుందని అన్నారు. వైద్యానికి ఉన్న ప్రాధాన్యతను గమనించి, గత సంవత్సరం కన్నా మరిన్ని నిధులు కేటాయించాలని ఆర్థికమంత్రికి సూచించామని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్రమాలు పెరిగిపోయాయని, త్వరలోనే వాటికి పులుస్టాప్ పెడతామని వివరించారు.