: పోలీసు స్టేషన్ లో ఎదురెదురుగా మధుప్రియ, శ్రీకాంత్
పెళ్లయిన ఆరు నెలలకే విభేదాలతో పోలీస్ స్టేషన్ కు ఎక్కిన గాయని మధుప్రియ, శ్రీకాంత్ ల బంధం ఏమవుతుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. వీరిద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టిన పోలీసులు కౌన్సెలింగ్ నిపుణులతో మాట్లాడిస్తున్నారు. గత రాత్రి శ్రీకాంత్ పై దాడి జరుగగా, ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం, తన భార్యను తనకు అప్పగించాలని, తనతో తీసుకువెళ్తానని చెబుతూ శ్రీకాంత్ హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ లోనే కూర్చున్నాడు. ఆపై విషయాన్ని మధుప్రియకు చెప్పిన పోలీసులు కౌన్సెలింగ్ కు రావాలని ఆదేశించగా, ఆమె వచ్చారు. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టిన నిపుణుల బృందం వారి మనసులో ఏముందన్న విషయాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారిద్దరి మధ్యా నెలకొన్న వైవాహిక బంధం ఆరు నెలలది మాత్రమేనని, ఇంత తక్కువ సమయంలో వారు కలిసున్నది కూడా రెండు నెలలేనని తెలుస్తోందని వెల్లడించిన పోలీసులు, సాధ్యమైనంత వరకూ కౌన్సెలింగ్ తో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.