: రెండు, మూడు సినిమాల తరువాత నటనకు గుడ్ బై: పవన్ కల్యాణ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అసంఖ్యాక అభిమానులకు ఈ వార్త బాధను కలిగించేదే. తాను నటనకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. "నన్ను నేను కాపాడుకునేందుకు సినిమాలు చేస్తున్నా. మరో రెండు మూడు చిత్రాల తరువాత విరమించుకుంటా. రాజకీయాల్లో చేరి సేవ చేయడం నాపై ఉన్న అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నా" అని పవన్ కల్యాణ్... రచయిత, జర్నలిస్ట్ అయిన అనుపమ చోప్రాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో చేరాలన్న కోరిక, తన చిన్ననాటి నుంచి మనసులో ఉండిపోయిందని ఈ సందర్భంగా పవన్ చెప్పారు. కాగా, 2014లో 'జనసేన' పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఆయన, అప్పటి ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా, బీజేపీ-టీడీపీ అలయెన్సుకి మద్దతు పలికిన సంగతి విదితమే. అనుపమ చోప్రా చేసిన ఈ వీడియో ఇంటర్వ్యూను నిన్న యూట్యూబ్ లో పెట్టగా, ఇప్పటికే 1.10 లక్షల మందికి పైగా వీక్షించారు.