: దాయాదుల పోరును ప్రత్యక్షంగా చూడాలంటే డబ్బే కాదు... లక్కూ ఉండాల్సిందే!


చాలాకాలం తర్వాత భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దాయాదుల పోరుగా ప్రసిద్ధికెక్కిన ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈ రెండు దేశాల్లోని క్రికెట్ లవర్సే కాక విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ 'జెంటిల్మన్ గేమ్' ప్రియులు కూడా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అయితే ఆసక్తి చూపేవారందరికీ స్టేడియంలో చోటుండదుగా. మరి ఏం చేయాలి? ముందుగా వరుసలో గంటల తరబడి నిల్చుని వేల రూపాయలు పెట్టి టికెట్టు కొనాలి. ఏమాత్రం ఆలస్యం అయినా టికెట్లన్నీ అమ్ముడుబోయి ‘హౌస్ ఫుల్’ బోర్డు వెక్కిరించడం ఖాయం. మొన్నటిదాకా జరిగినది ఇదే. తాజాగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఈ నెల 19న కోల్ కతాలోని ప్రఖ్యాత స్టేడియం ‘ఈడెన్ గార్డెన్స్’లో మ్యాచ్ జరగనుంది. టికెట్ల కోసం అభిమానుల వేలం వెర్రిని తట్టుకోలేమని భావించిన ఐసీసీ, బీసీసీఐ ఆన్ లైన్ టికెట్ల విక్రయానికి తెర తీసింది. కొద్దిసేపటి క్రితం (సరిగ్గా 12 గంటలకు) ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమైపోయింది. ఈ బుకింగ్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ‘బుక్ మై షో.కామ్’వేదికగా ప్రారంభమైన ఈ టికెట్ల విక్రయంలో సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. ముందుగా సదరు వెబ్ సైట్లోకి ఎంటరై మన పేరు, ఈ-మెయిల్ అడ్రెస్, మొబైల్ నెంబరు ఎంటర్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సదరు సైట్ ఆటోమేటిక్ లాటరీ సిస్టం ద్వారా ఎంపికైన క్రికెట్ లవర్స్ కు మాత్రమే టికెట్లను కేటాయిస్తుందట. నేటి మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ 48 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, సోమవారం మధ్యాహ్నంలోగా పేర్లు నమోదు చేసుకోవాలి. అందరికంటే ముందుగా స్పందించి, పేర్లు నమోదు చేసుకున్నా టికెట్లు దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు. అదే సమయంలో చివరి నిమిషంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి టికెట్లు దొరకవని కూడా చెప్పలేం. అంటే, ఈ టికెట్లు కావాలంటే డబ్బుతో పాటే ‘లక్కు’ కూడా ముఖ్యమేనని చెప్పక తప్పదు.

  • Loading...

More Telugu News